TEJASVI ASTITVA
MULTI-LINGUAL MULTI-DISCIPLINARY RESEARCH JOURNAL
ISSN NO. 2581-9070 ONLINE

“ మహిళలపై  హింస ” -Dr.K.V.VIJAYA VENI,

అంశం :   “ మహిళలపై  హింస ”

Dr.K.V.VIJAYA VENI, M.Phil.,Ph.D.in Dance, M.A.English,

Guest faculty in Dance,  Dept.of Music&Dance,

Ph.D.Scholar in Journalism and Mass Communication,

Theatre of Arts(Diploma in Direction), Andhra University, Visakhapatnam

Contact No: 9393114901

ఈ భూమిపై ఒక జీవిగా మనం నమ్ముతున్నటువంటి ఒక అద్భుత శక్తి పైలోకం నుండి నడిపిస్తుందనే నమ్మకం ఆధారంగా, సృష్టి ఏర్పాటులో వివిధ రకాలైన ప్రాణులు ఆవిర్భవించాయి. అందులో మానవ, జంతు, వృక్ష జాతులు వున్నాయి. అయితే వీటిలో ఆలోచనా శక్తీ కలిగి దానికి తగ్గట్టుగా ప్రవర్తించగల విచక్షణను కలిగి, దానిని వ్యక్త పరచడానికి “ మాట్లాడే”శక్తి మరియు అవకాశాన్ని కల్పించింది కేవలం “ మానుష జన్మకు” మాత్రమె. ఇంతటి ఉన్నత స్థానాన్నిపొందిన మనం స్త్రీ,పురుష భేదాలుగా సృష్టిoచబడినప్పటికీ. శారీరకంగా గల సహజ బలహీనతలను అడ్డుపెట్టుకుని ‘పురుష’ అనే బలమైన అధికారంతో అన్ని విధాలుగా అన్ని వయస్సుల యందు హింసకు గురి చేయడం అనాదిగా మనం గమనించగలం. మన సృష్టిని చేసిన ఆ భగవంతుడే తమ భార్యలను ఎల్లవేళలా తమ వెంటనే ఉంచుకుంటూ మరియు సృష్టి వినాశకారుడైన ఈశ్వరుడు త్రిలోకమాత అయినటువంటి తన భార్య పార్వతీదేవిని తన శరీరం నందు ఎడమ భాగము నందు ఇముడ్చుకుని అర్ధనారీశ్వరుడై ప్రపంచానికి ఆదర్శ ప్రాయుడైనాడు. అయితే, మనం మాత్రం మనకు గల సంకుచిత బుద్ధితో మనం నిద్ర లేచినప్పటినుండి తిరిగి నిద్రపోయే దాక ఇంకా నిదురలో ఏర్పడే ఇబ్బందులను ఆసరాగా అవసరాలను తీర్చడానికి అనగా, నీరు అందించడం మొదలైన అనగా మన ప్రతీ దినచర్య యందు ప్రతీ నిమిషం మనతో తోడుగా నీడగా వుండే స్త్రీని తనకు గల సహజ బలహీనతలను వాడుకుంటూ వారి శ్రమను గుర్తించక ప్రపంచంలో ఏదోవైపు ప్రతీ నిమిషం మనం చూచే లేదా వినే వార్తలను గమనిస్తే చాలా విచారం కలుగుతుంది. గృహ హింస, పనిచేసే ప్రదేశం వద్ద హింస, స్త్రీ మరియు పిల్లలను అసభ్యకరంగా మాట్లాడడం, సైబర్ టెక్నాలజీ అనగా ప్రస్తుత విస్తృత ప్రచారంలో ప్రపంచమంతా ఒక చోటికి చేరుకోవడం ద్వారా టెక్నాలజీ బాగా వృద్ది చెంది, దాన్ని అందుకోలేని కొందరు వాటికి బలి అవడం, సాహిత్యం నందు గల స్త్రీ హింసను ఇలా పలు రకాలుగా మహిళను హింసించే విషయాలను గమనించగలo.

ఒకప్పటి కాలంలో ‘స్త్రీ’కి ఎంతో గౌరవం వుండేది.

“యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ||……..

ఎక్కడైతే స్త్రీ గౌరవిoపబడుతుందో అక్కడ దేవతలందరూ హర్షిస్తారు…..

వేదకాలo నందు గల వైదిక సిద్ధాంతం నందు పురుషుని కంటే స్త్రీయే ఉన్నత స్థానాన్ని కలిగి వుందని వివరించడం జరిగింది. కాలక్రమేణా మధ్యయుగం నందు సాంఘిక దురాచారాలైనటువంటి సతి, వరకట్న, బహుభార్యత్వం, బాల్య వివాహాలు, నిరక్షరాస్యత, వితంతు వివాహాల రద్దు మొదలైన సమాజంలో కేవలం ‘స్త్రీ’ ని అణగద్రొక్కి వారి స్వేచ్చను హరించి ఇంటి వద్దనే వుంచడం జరిగింది. ఎప్పుడైతే గృహానికి పరిమితం చేసినప్పటి నుండి కనీసం ఒక మనిషిగా వున్నా హక్కులన్నీ మెల్లిగా హరించుకు పోయాయి.నిరక్షరాస్యత , గృహ హింస మొదలైనవి ఆరంభమయ్యాయి.

తదుపరి కొన్ని శతాబ్దాల అనంతరం సహజంగా ఆయా భౌగోళిక, ఆర్ధిక,సామజిక పరిస్థితులలో ఏర్పడిన మార్పుల వల్ల ‘స్త్రీ’ కొద్దిగా బయటకు వచ్చి విద్యను ఆర్జించి ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ, కొంత ఆర్ధికంగా తన కుటుంబానికి ఆసరాగా నిలవడం జరుగుతుంది. అయితే, కుటుంబానికి సంబoధించిన గృహ నిర్వహణ బాధ్యతలైన భర్త, పిల్లలు మరియు ఇంటి వద్ద తమతో వుండే వృద్ధుల సేవలు వంట,రక్షణ,ఇంటి పనులతో పాటు ఉద్యోగ లేదా వ్యాపార బాధ్యతలు భారమై, వంశాభివృద్ధి కోసం ప్రసవ నొప్పులు భరిస్తూ తద్వారా ఏర్పడే అనారోగ్య సంబంధ బాధలను తట్టుకుంటూ పిల్లల సంరక్షణ చేయడం అంటే ఎంతో కష్టమైన పని. ‘ స్త్రీ’ ఎప్పుడూ తన లోకం తన కుటుంబమేనని భావిస్తుంది. ఎన్ని ఉద్యోగ బాధ్యతలు నిర్వహించినా/ నిర్వహిస్తున్నా అనుక్షణం తన కుటుంబం గురించే ఆలోచన చేస్తుంది. భగవంతుడు సృష్టించిన సృష్టికి ప్రతి సృష్టి చేసే అదృష్టాన్ని మరియు అరుదైన శక్తిని ‘స్త్రీ’ కి మాత్రమె భగవంతుడు కల్పించి ఎంతో ఉన్నత స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అయితే దీనికి పురుషుని సహకారంతోనే జరగాలని భగవంతుని ఆశీర్వాదం. కావున, కేవలం పురుషుని వల్లనే ఈ సృష్టి జరుగుతుందని అపోహ పడరాదు.

ఎన్నో శ్రమకోర్చి బ్రతకడం కోసం సంపాదన చేస్తున్న పురుషుని తను పడ్డ/పడుతున్న బాధలన్నీ పక్కనపెట్టి సేదతీర్చి ఆలిస్తూ ఆనo దపరుస్తుంది ‘స్త్రీ’. కేవలం ఒక చిరునవ్వు, ఆత్మీయ పలకరింపు, తాను చేసిన పనియండు చిన్నపాటి పొగడ్త లేదా సున్నితపు దిద్దుపాటు తనకు మన “కుటుంబం” ఉందనే ధైర్యం ఇవ్వడంతో ఆమె ఎటువంటి కష్టాలైనా భరించి తన వారి కోసం అహర్నిశలు శ్రమిస్తుంది.

సహజంగా సున్నిత మనస్కురాలైన ‘స్త్రీ’ ని హింసించడం అనేది దుశ్చర్య అవుతుంది.ప్రస్తుతం ఎన్నో వార్తల్లో తన భర్త ఎంత హింసించినప్పటికీ వదిలేసి బయటకు పంపినా ‘భర్తే’ కావాలని మౌన, నిరాహార దీక్షలు చేసే వారిని మనం చూస్తున్నాం. ఎందుకంటే పురాణే తిహాసాల్లో ఎంతో బలమైన కుటుంబ వ్యవస్థకు పవిత్రమైన అర్ధాన్ని ఇవ్వడం, వాటిని ఇంటి వద్ద చిన్నతనం నుండే తమ అమ్మమ్మ, అమ్మల వద్ద నుండి నేర్చుకుని, ఎంత ఆధునిక నాగరికతను పొందినప్పటికీ అవి నరనరాల జీర్ణించుకుపోవడం అనేది మన భారత దేశానికి సంపద వంటిది. సాంప్రదాయాలను,ఆచార వ్యవహారాలను ఒక తరం నుండి మరొక తరానికి అందించే శక్తీ గలిగినది ‘స్త్రీ’. ఈ కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే పటిష్టంగా వుంటుందో అప్పుడే సంప్రదాయ విలువలు గల్గిన మెరుగైన సమాజం ఏర్పడుతుంది.తద్వారా జిల్లా,రాష్ట్రం,దేశం సుభిక్షంగా వుంటుంది.

ఇంతటి ప్రాధాన్యత కల్గిన ‘స్త్రీ’ ని హింసించకుండా వుంటే కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఈ విధంగా గృహ హింసకు గానీ పనిచేసే ప్రదేశం వద్ద హింస ఇలా రకరకాల ప్రాంతాల్లో హింసకు గురిచేయకుండా వారిని గౌరవించే కాపాడే బాధ్యత నేర్పించాల్సిన కర్తవ్యం కూడా ‘స్త్రీ’ మీదనే కలదు.

ఎందుకనగా, ప్రస్తుతం మనం చూస్తున్న అరాచకాలన్నీ పురుషుని వల్లనే జరుగుతున్నాయి. అయితే ఆ పురుషునికి  పుట్టినప్పటినుండీ అనగా బాల్య దశ నుండి వార్ధక్య దశ వరకు స్త్రీ తనకు తల్లి, భార్య, కూతురి వలే తన వెన్నంటే వుండగా తన జీవితాన్ని ప్రారంభించి ముగిస్తాడు. అయితే ఈ పురుషుడు ఎ స్థితిలో ఎ విధంగా నడచుకోవాలో నేర్పాల్సిన బాధ్యత వుంది. ఉదా: సునీత అనే స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చి పెంచడం జరుగుతుంది. ఆ సమయంలో తల్లిగా ఏ విధంగా పర స్త్రీ యందు కూడా తన తల్లిని చూసుకోవాలని, తదుపరి వివాహం అయిన తర్వాత భార్యని ప్రేమగా చూచుకోవాలో ఆ తల్లితండ్రుల మధ్య గల అనురాగ బంధాన్ని ఆదర్శంగా తెలియపరచాలి. ఇక, చివరి దశలో కూతురులాంటి వయస్సు గల కోడలిని మరియు ఇతర ఆడపిల్లలను తమ కూతుర్ల వలె ఇంకా ప్రస్తుత కలియుగంలో ఇంకా మనవరాలి వయస్సుగల పసిపిల్లలను దేవుళ్ళ వలె భావించి వారికి ఎటువంటి హానికలిగించరాదని మరియు వారికీ స్వేచ్చగా బ్రతికే అవకాశాన్ని కల్పించాలని (అనగా స్వేచ్చగా ఆరుబయట ఆటలు ఆడుకొనే విధంగా) నేర్పించాలి. ఎందుకంటే, ప్రతీ ప్రాణికి మొట్టమొదట గురువు ‘తల్లి’ మాత్రమే. ప్రధాన బాధ్యత ఆమెదే. ఏదైనా ఒక ప్రాణిని సంస్కరించేది తల్లి యే. ఆ తర్వాత వారు సంచరిస్తున్న పరిస్థితులకు లోనయ్యే ప్రభావాలను  కూడా కనిపెట్టుకుని జీవితకాలం కాపాడితే హింసారహిత సమాజం ఏర్పడుతుంది.

వీటిని ఎదుర్కొని నిలవగలిగే ఆత్మస్థైర్యాన్ని మనం ప్రతి స్త్రీ కి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా వుంది.

CLOSE
CLOSE