కారుణ్యం- సంభాషణా చాతుర్యం
(శ్రీనాథుని శృంగార నైషధం)
– డా.పి.వి.లక్ష్మణరావు, తెలుగు ఉపన్యాసకులు,
ట్రిపుల్ ఐటీ-నూజివీడు, కృష్ణాజిల్లా.
చరవాణి: 9492043837.
చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర – బాల్య౦లోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢకవి శ్రీనాథుడు. ఈయన పాండిత్య గరిమతో పాటుగా అచంచలమైన ఆత్మవిశ్వాసం మూర్తిభవించిన బ్రాహ్మీమయ మూర్తిగా వారి రచనలు చదువుతూ ఉంటే తెలుస్తుంది. శ్రీనాథుడు 15వ శతాబ్ద౦లో జీవించాడు. కొండవీటి ప్రభువైన సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థానకవి. విద్యాధికారి. డిండిమభట్టు అనే పండితుని వాగ్యుద్ధ౦లో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించాడు. ఈతనికి కవిసార్వభౌముడను బిరుదు ఉంది. ఇతను ఎన్నో కావ్యాలు రచించి కావ్య యుగానికి కర్త అయినాడు. వాటిలో భీమఖండ౦, కాశీ ఖండ౦, మరుత్తరాట్చరిత్ర, శృంగార నైషధ౦ మొదలైనవి ఉన్నాయి. ఈయన వ్రాసిన చాటువులు ఆంధ్రదేశమంతటా బహుప్రశస్తి పొందాయి.
శ్రీనాథుడి నుంచి మనం నేర్చుకోవలసింది ఇంతా అంతా కాదు. బోలెడంత ఉంది. అతని వ్యక్తిత్వం, జీవితం నేర్పే గుణపాఠాలు ఎన్నో. బ్రతికితే శ్రీనాథుడిలా బతకాలి – మరణించినా శ్రీనాథుడిలాగే మరణించాలి. “కంటికి నిద్ర వచ్చునే? సుఖంబగునే రతికేళి?… శత్రువుడొకడు దనంతటివాడు గల్గినన్” అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించాడు. “డంబు సూపి భూతలంబుపై తిరుగాడు/ కవిమీదగాని నాకవచమేయ/ దుష్ప్రయోగంబుల దొరకని చెప్పెడు/కవి శిరస్సున గాని కాలుచాప/ సంగీత సాహిత్య సరస విద్యల నేర్చు/ కవుల రొమ్ముల గాని కాల్చివిడువ/ చదివి చెప్పగ నేర్చి సభయందు విలసిల్లు/ కవినోరు గాని వ్రక్కలుగ తన్న” అని ఎదిరించి నిలిచాడు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు అరుస్తాయి గదా అన్న భావం చెప్పక చెప్పాడు.
“బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు/శాంతి నిప్పచ్చరంబు మచ్చరము ఘనము” అని భీమఖండంలో నూతిలో కప్పలవంటి వదరుబోతు పండితులపై కన్నెర్రజేశాడు. అయినా ఎల్లవేళలా ఈ ఆత్మప్రత్యయం, ఈ ఠీవీ చెలామణి కాదు. సందర్భాన్ని బట్టి ప్రయత్నించాలి. అందుకే శ్రీనాథుడు ఒక్కొక్కసారి సహనం అవసరమేనంటూ చెప్పిన పద్యమిది- “నికటముననుండి శ్రుతి నిష్ఠురముగ/ నడరి కాకులు బిట్టు పెద్దఱచినప్పు/డుడిగి రాయంచ యూరక యుంట లెస్స/ సైప రాకున్న నెందేని జనుట యొప్పు” – కాకులు గోలపెడుతున్నప్పుడు ఓర్పుతో సహించాలి. లేదా వాటినుండి దూరంగా వెళ్ళాలి. అంటే ఆ కాకులతో మనమూ గోలచేస్తే మన స్థాయి పతనమైనట్టే గదా! ఇది మన జీవితంలో చాలా సందర్భాలకి ఉపకరిస్తుంది.
శ్రీనాథుడు భోగి. రసికుడు. ఎన్నో సుఖాలు అనుభవించాడు. అవకాశాలను అనుకూలంగా మలచుకోవడంలో తనకు తానే సాటి. అయినా రాజుల రోజులు ముగిసిన తర్వాత కష్టాల పాల్పడ్డాడు. బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, ఈశ్వరార్చన కళాశీలుడూ, కవిసార్వభౌముడు, ఆగమ జ్ఞాననిధి అయిన శ్రీనాథుడు ఎన్నో బాధలు పడ్డాడు.
“కుల్లాయుంచితి కోక చుట్టుతి మహాకూర్పాసముండొడ్లితిన్
వెల్లులిందిల పిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా
చల్లాయంబలి ద్రావితిన్ రుచులు దోసంబంచు పోనాడితిన్, తల్లీ
కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా, నేను శ్రీనాథుడిన్” అని వాపోయాడు. గతకాలంలో ఎప్పుడూ చేయలేని, ఇష్టపడని పనులు చేశాడు. అలవాటు లేనివన్నీ అనుభవించాడు. ఎంతటివాడికైనా కాలం బాగుండకపోతే అష్టకష్టాలు తప్పవని అనుభవాలు చెప్తాయి. జొన్నకూడు తిన్నాడు. సన్నన్నం దొరకలేదు. తన పంటపొలాలకు శిస్తు కట్టలేకపోయాడు. శిస్తు కట్టనందుకు కఠినమైన శిక్షలు అనుభవించాడు.
జీవితం “చక్రార పంక్తిరివ గచ్చతి భాగ్యపంక్తిః”కి నిదర్శనం. ఎప్పుడూ కష్టాలే ఉండవ్. ఎప్పుడూ సుఖాలే ఉండవ్. వెలుగునీడలు సహజాతి సహజం. సుఖాలకి పొంగిపోకూడదు. కష్టాలకు కుంగి పోకూడదు. అదే స్థితప్రజ్ఞత్వం. మనం మంచి జరిగితే విర్రవీగిపోతాం. కష్టం లేదా దుఃఖం వస్తే న్యూనతాభావంతో ఇతరులను తిట్టిపోస్తాం. ఇది సరైన పద్ధతి కాదు. “బాధే సౌఖ్యమనే భావన” రావాలి. సుఖదుఃఖాల్ని స్వాగతించగలవాడే జీవితాన్ని ఆస్వాదించగలడు. మరొకరికి ఆదర్శప్రాయుడూ కాగలడు.
శ్రీనాథుడు గత భోగాల్ని తలచుకొని దిగులు చెందినా మరణానికి జంక లేదు. అతనికి ఎంత ‘ఖలేజా’ ఉందో పరిశీలించండి. “కాశికా విశ్వేశు కలిసే వీరారెడ్డి/రత్నాంబరంబులే రాయు డిచ్చు?/కైలాసగిరి పంట మైలారు విభుడండే/దినవెచ్చ మేరాజు దీర్చగలడు?/రంభగూడే దెనుంగు రాయరాహత్తుండు/ కస్తూరికేరాజు ప్రస్తుతించు?/సర్వస్థుడయ్యె విస్సన్న మంత్రి మఱి హేమ/పత్రన్న మెవ్వని పంక్తి గలదు?” అంటూ గతవైభవాన్ని నెమరు వేసుకొన్నా – మరణం సమీపిస్తున్నా దిగులు చెందడం కన్న పరిస్థితిని ఎదుర్కొనే స్థైర్యం కలవాడు శ్రీనాథుడు. జీవితం ఒక సవాలు – దాన్ని స్వీకరించాలి అన్నదే శ్రీనాథుడు ఇచ్చే సందేశం. దీనికి ఈ రెండు పాదాలు నిలువెత్తు సాక్ష్యాలు. “దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ/నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి”- స్వర్గలోకంలో తనకంటే ముందు వెళ్ళిన మహాకవులున్నారు. వాళ్ళ గుండెలు గుభేలుమనేలా – అమ్మో, శ్రీనాథ మహాకవి వస్తున్నాడు అని భయం కలిగేలా – నేను కూడా స్వర్గానికి వెళ్తున్నాను” అని ఠీవీగా పలికాడు. మరణాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. దాన్ని స్వీకరించాలి – దానికి గుండె ధైర్యం కావాలి. ఈ విధంగా శ్రీనాథుడి జీవితం, పద్యాలు మనకి కావలిసినంత ‘పెర్సనాలిటీ డెవలెప్ మెంట్’ను బోధిస్తాయి.
తెలుగు సాహితీ లోకంలో ఒక విరాణ్మూర్తిగా వెలుగొందిన శ్రీనాథునిచే రచించబడిన శృంగారనైషధం సంస్కృతంలో శ్రీహర్షుని రచనయైన నైషదీయ చరిత్రకు తెలుగీకరణ. ఇది నలదమయంతుల కథ. వారిద్దరి మధ్య సఖ్యతను పెంపొందింపజేసి ప్రేమను కలిగించింది ఒక హంస. బంగారు రెక్కలు గల ఈ హంస మొదట నలుని ఉద్యానవనంలోని కొలనులో విహరిస్తూ నలునికి పట్టుబడుతుంది. కాంచనం ఎటువంటివారినైనా వ్యామోహానికి గురిచేస్తుంది. హంసను నల చక్రవర్తి పట్టుకున్నాడు. హంస వాక్చాతుర్యంతో చక్రవర్తిలో కారుణ్యాన్ని పెంపొందించి ఆపదనుండి తప్పించుకున్నది. సమయస్పూర్తి, సంభాషణాచాతుర్యంతో ఎలాంటివారినైనా మెప్పించి, ఎలాంటి కార్యాన్నైనా సాధించుకోవచ్చునని నిరూపించిన కథ ఇది. గొప్పవారి మనసు దయ కరుణ ఔదార్యాది సద్గుణాలతో మార్దవంగా ఉంటుందని స్పష్టంచేసే కథ ఇది. ఈ పాఠ్యభాగం శ్రీనాథుడు రచించిన శృంగారనైషధ కావ్యం ప్రథమాశ్వాసంలోనిది.
నలచక్రవర్తి ఉపవన విహారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గొప్ప సరస్సును చూచాడు. ఆ సరస్సు సమీపంలోనే నిద్రిస్తున్న ఒక అందమైన హంసను నలమహారాజు మెల్లమెల్లగా వంగి వంగి నడుస్తూ వామనుని వలె చప్పుడు కాకుండ పోయి తన రెండుచేతులతో పట్టుకున్నాడు. నిషధరాజు చేత పట్టుబడి మేల్కొన్న ఆ బంగారుహంస కంచుగీసినట్లుగా అరుస్తూ ఎగరడానికి ప్రయత్నిస్తూ మానవ భాషలో ఆ రాజుతో ఇలా పలికింది.
ఱెక్కలకొనలం గలిగిన
యిక్కాంచన మాసపడియెదే నృపనీకే
యక్కఱ దీనం దీరెడు
నక్కట! నీహారలేశమబ్ధికి బోలెన్.
ఓ రాజా! నా ఱెక్కల కొసలందున్న బంగారానికి ఆశపడుతున్నావా? దీనివల్ల నీకు ఏ అవసరం తీరుతుంది. సముద్రానికి మంచుచుక్క వలె ఈ స్వల్పమైన బంగారం నీకెందుకూ పనికిరాదు. అంతేకాదు నీవు నాకు సమీపంలోనే తిరుగుతున్నావని తెలియదు. తెలిస్తే ఇంత ఏమరపాటుగా ఉండేదాన్ని కాదు. నీవు లోకంలో అందరిచేత గౌరవింపబడేవాడవనీ ఈ దేశంలో ఎవరికీ ఆపద కలుగనీయవనీ నీయందు నమ్మకంతో ఇలా నిద్రించాను. గొప్పవారు తనను నమ్మినవారిని శత్రువైననూ నాశనం చేయడానికి ప్రయత్నించరు కదా! అని కింది విధంగా తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
ఎఱుగనె నీవుప్రాంతమున నింతటనంతట నున్కియింత యే
మఱదునె నిన్ను విశ్వజన మాన్యుడవంచును విశ్వసించి యి
త్తఱి సుఖనిద్ర బొందితి వృథామతి నెట్టన యాత్మ నమ్మినం
జెఱుపదలంతురే ఘనులు చిత్తమునం బగవారి నేనియున్.
అయినా నీకు హింస చేయడమే వేడుక అనుకుంటే దయ చూపదగిన ఈ సరోవర హంసను చంపడానికి ప్రయత్నించడమెందుకు? భుజగర్వం చేత అతి సాహసకృత్యాలు చేస్తూ మిక్కిలి మదించి యున్న శత్రురాజులు ఎంతోమంది ఉన్నారు కదా! వారిని చంపరాదా? ఫలపుష్ప కందమూలాదులు తింటూ నీటిలో మునులవలె తపస్సు చేసుకుంటున్న మామీద దండనీతిని ప్రయోగించడం నీకు తగునా? అంటూ నల చక్రవర్తికి తనపై జాలి కలిగే విధంగా మాట్లాడింది.
హింసయు నీకు వేడ్కయగు నేని కృపాశ్రయమైన యీసరో
హంసము జంపనేల కఱవా తరవాత వసుంధరాధిపో
త్తంస! విజృంభమాణ భుజదర్పనిరంకుశ సాహసక్రియా
మాంసలచి త్తవృత్తులయి మ త్తిలియుండు నరాతిభూపతుల్.
తనను రక్షంచి వదిలిపెట్టమని ఎంతో దయనీయంగా వేడుకున్న తీరుని ఈ కింది పద్యంలో శ్రీనాథుడు వర్ణించన తీరు సందర్భోచితంగా ఉంటుంది.
తల్లి మదేకపుత్త్రక పెద్ద కన్నులు
గాన దిప్పుడు మూడు కాళ్లముసలి
యిల్లాలు గడుసాధ్వి యేమియు నెఱుగదు
పరమపాతివ్రత్య భవ్యచరిత
వెనుకముందర లేదు నెనరైనచుట్టంబు
లేవడి యెంతేని జీవనంబు
గానక కన్న సంతానంబు శిశువులు
జీవనస్థితి కేన తావలంబు
కృప దలంపగదయ్య యో నృపవరేణ్య
యభయ మీవయ్య యో తుహినాంశువంశ
కావ గదవయ్య యర్థార్థి కల్పశాఖి
నిగ్రహింపకు మయ్య యో నిషధరాజ.
నా తల్లికి నేనొక్కడనే కొడుకునని, ఆమె చూపు కూడా లేని మూడు కాళ్ళ ముసలితల్లి అనీ, నా ఇల్లాలు అమాయకురాలు, ఉత్తమురాలనీ, ముఖ్యంగా ఏమి తెలియని అమాయకురాలు, పరమపతివ్రత, ప్రశస్తమైన చరిత్ర కలిగిందనీ, నాకు వెనక ముందు దయగల చుట్టం లేదు. పేదరికమే నా జీవనం. లేకలేక కలిగిన సంతానం. వారు పసిపిల్లలు. వారికి జీవనాధారం నేనే. కనుక దయదలచి నాకు అభయం ఇచ్చి కాపాడు. కోరిన వారికి కల్పవృక్షంవంటివాడా! చంద్రవంశీయుడవైన ఓ నిషధ రాజా నన్ను చంపవద్దని ఆ హంస చేత శ్రీనాథుడు ఎంత స్వభావసిద్ధంగా దయనీయంగా చెప్పించాడో చూడండి. అలతి పదాలూ, చక్కని వాడుక పలుకుబడులు, తెలుగు జాతీయలూ, వీటన్నిటితో పద్యం ఎంత కాంతి వంతంగా ఉందో చూడండి. పైగా సీస పద్యం శ్రీనాథునికి ప్రత్యేకమైనది కూడా.
ఈ పద్యంలో పెద్ద పెద్ద సంస్కృత సమాసాలను పక్కన బెట్టి వాడుకభాషలోని తెలుగుపదాలనే వాడాడు. కన్నుల్ కానదు, మూడు కాళ్లముసలి, వెనుకముందర లేదు, కానక కన్న సంతానంబు ఇలాంటి జీవద్భాష లోంచి ఉబికివచ్చిన పలుకుబళ్ళు, ముఖ్యంగా ఒక గొప్పవాడిని వేడుకునేటప్పుడు సామాన్యుడు తనబాధలను ఎంత దయనీయంగా ఏకరువు పెడతాడో ఆ వైనమూ, ఒక చిన్న గీత పద్యంలో చెప్పగలిగిన భావాన్ని వివరంగా సీస పద్యంలోకి విస్తరించి చెప్పి, చక్కటి శ్రవణ పేయతనే గాక, ఆర్ద్రమైన అనుభూతిని సాధించిన నేర్పూ చాలా గొప్పవి.
అక్కటకటాదైవంబ! నీకంటికిం బేలగింజయుం బెద్దయయ్యె నే? జననీ! ముదుసి ముప్పు కాలంబున సుతశోకసాగరంబెబ్భంగి నీదగలదానవు? ప్రాణేశ్వరీ! యేచందంబున మద్విరహ వేదనాద వానలంబునం దరికొనియెదవు? సఖులారా! యేప్రకారంబునం బుటపాకప్రతీకాశంబైన కరుణ రసంబున బురపురం బొక్కెదరు? బిడ్డలార! యేలాగున నతిక్షుత్పిపాసాకులంబులై కులాయకూలంబులం గులకులం గూసెదరని విలాపంబు సేయుచు దృగ్గోళకంబుల వేడి కన్నీరువెడల గోలుగోలున నేడ్చినం గృవాళుండై యాభూపాలుండు హస్తపల్లవంబులు వదలి రాజహంసంబ పొమ్ము సుఖంబుండుమని విడిచిపుచ్చె.
అయ్యో దైవమా! నీకంటికి పేలగింజ పెద్దదిగా కనిపించిందా? ఓ తల్లీ ముసలిదానివైన నీవు అంత్యకాలంలో ఈ పుత్రశోకం అనే సముద్రాన్ని ఏ విధంగా ఈదగలవు? ప్రాణేశ్వరీ ఏ రకంగా నా విరహమనే కార్చిచ్చుచేత దహింపబడగలవు? స్నేహితులారా ఏ ప్రకారంగా పుటం పెట్టడంవల్ల కలిగిన వేడితో సమానమైన దుఖ బాధను భరించగలరు? బిడ్డలారా ఆకలి దప్పులతో గూళ్ళలో కలకలమని ఎలా అరవగలరు అంటూ కనుగ్రుడ్లనుండి వేడి కన్నీరు కారుతుండగా హంస గోలుగోలున ఏడుస్తుండగా కృపాలుడై ఆ నలమహారాజు పొమ్ము సుఖంగా ఉండుమని చిగురుటాకుల వంటి తన చేతులనుండి రాజహంసను విడిచిపెట్టాడు.
ఈ విధంగా హంస తన వాక్చాతుర్యంతో నల మహారాజును మెప్పించి బంధవిముక్తురాలైంది. ఈ హంసయే తను చేసిన ఉపకారానికి బదులుగా నలదమయంతుల మధ్య దౌత్యాన్ని నడిపి వారి కలయికకు కారణభూతమౌతుంది. హంస దౌత్యమే నల కథకు ముఖ్యమవుతుంది. నలుని గుణాలు దమయంతికి దమయంతి గుణాలు నలునికి తెలిపి ఒకరి పట్ల మరొకరికి ప్రేమభావన కలిగేలా చేస్తుంది.
ఉపయుక్త గ్రంథ, వెబ్ సైట్ల సూచి:
శృంగార నైషధం – శ్రీనాథుడు, జయంతి పబ్లికేషన్స్, విజయవాడ.
http://acchamgatelugu.blogspot.in/
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/june2007
*****