TEJASVI ASTITVA
MULTI-LINGUAL MULTI-DISCIPLINARY RESEARCH JOURNAL
ISSN NO. 2581-9070 ONLINE

గృహ హింస- దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ,

గృహ హింస

ఉపోద్ఘాతం :

భారతీయ సమాజం గొప్ప వారసత్వ వైభవం కలిగి ఉంది. ప్రపంచం భారతావనిని ప్రపంచ దేశాలు గౌరవించడానికి విలువలతో కూడిన కుటుంబ వ్యవస్థ కారణం అయితే ప్రతి విషయం నందు ప్రగతి, అధోగతి రెండూ సమాతరంగా ప్రయాణించినట్లు గొప్ప విలువల బింబం కుటుంబం కూడా చెడ్డ సంస్కారపు మసిని పూసుకొని చెడుగా ప్రతిబింబిస్తోంది. అంతరిక్షం వరకు మన విజ్ఞానం వెళ్ళినా ఒక్కొక్కసారి వ్యక్తుల సంకుచిత ప్రవర్తన వలన, మనం తిరిగి ఆటవిక దశకు, రాక్షస ప్రవృత్తికి చేరుతునామన్న భావన కలుగుతుంది. విచిత్రంగా మహిళ హక్కులు, సమానత్వం వంటి అంశాలు గురించి నినదించే మనం సమాజ సౌధంలో వరకట్నం, గృహహింస, లైంగిక వేధింపులు వంటి విషయాలు గురించి, వాటి పరిష్కారాలు గురించి చర్చ వేదికలు నిర్వహించుకోవడం వేదన భరితం. హింస అనే పదం ఎక్కడ వినబడినా అది ఖండించదగిన విషయం. ప్రేమ అనేది ఆత్మీయతను పెంచితే, ద్వేషం అంతరాలని పెంచి, అంతకు మించి ఒక్కొక్కసారి హింసని ప్రేరేపిస్తుంది. ఏడు అడుగుల బంధం…. ఏడుతరాలకు వారధి. వివాహం అంటే ఒక చలనచిత్రంలో అన్న విధంగా ఇద్దరు వ్యక్తులకి సంబంధించినదే కాదు, రెండు కుటుంబాలకి వారధి. అందమైన  జ్ఞాపకంగా ఆజాన్మాంతం ఉండవలసినది. పీడకలగా మారితే జీవన చిత్రంలో ‘‘పెళ్ళి’’ అనే పదం తియ్యనిది. గుండె ఎప్పుడైనా తేలికగా తెంచుకొనే డేటింగు మీద మోజు పెరిగితే అది భారతీయ సంస్కారానికి అవమానం.

గృహ హింస అంటే అది అతివలకి పరిమితమైన అంశంగాదు ఆర్ధిక ఇబ్బందులు, మానసికంగా, బలహీనులుగా ఉండదు మగవారు సైతం కార్యాలయం నుంచి ఇంటికి చేరడానికి భయపడే పరిస్థితులు ఉన్నాయి ‘‘అమ్మ అనురాగాన్నిపంచుతుంది – అతివ ఆమెక్కని పెంచుతుంది’’ డా. సినారే గారు తన గేయం నందు చెప్పిన విధంగా ‘‘ మగువే గదా మగవాడికి మధుర భావన’’ అంతేగాని అది కాలకూట విషం గారాదు. మగవారు కూడా అమ్మని ఎలా అభిమానిస్తారో తన జీవిత భాగస్వామిని అదే రకంగా ఇష్టపడిన రోజు కుటుంబ న్యాయస్థానాలు, మహిళా న్యాయస్థానాలు, చట్టాలు అవసరం ఉండదు. ‘గృహహింస’ అనే పదం మన పరిసరాలు నుంచి దూరంగా వెళ్ళిపోయిన రోజు ‘వసుదైక కుటుంబం’ అంకురిస్తుంది. అనాధలు లేని ప్రపంచం ఏర్పడుతుంది. ఎదిగే ప్రతి చెట్టు పూలని అందించాలి అంతేకాని వాడిపోతే వనమాలి శ్రమకు విలువ ఎలా ఉంటుంది. కుటుంబం ప్రగతి ఫలాలని అందించాలి గాని పగలు, ప్రతీకారాలకి అది అర్థంకారాదు. పరిచయం ఎంతైనా చెప్పవచ్చు గాని వివరాలులోకి వెళ్ళడం రచయిత పాటించవలసిన ధర్మం.

నిర్వచనాలు:-

హింస రూపాలు :

మనస్సు చిత్రమైనది అది ప్రేమిస్తే ప్రాణం యిస్తుంది.  పగ పెంచుకుంటే ప్రాణం తీసే వరకు కలవరిస్తుంది. హింస అనే పదం విస్తృతంగా వ్యాపించడం బాధాకరం. విత్తనం ఎదిగి మహావృక్షంగా మారితే అది అంకురింపచేసిన మనస్సు ఆనంద పడుతుంది. ఆవృక్షాన్ని చీడపురుగు చిదిమివేస్తే కన్నీరు కారుస్తుంది. బంధం అను బంధంగా మారితే, తాతయ్య తరం సంతోషపడుతుంది. బంధం రాబందులా కబళిస్తే తరతరాలకి చెడ్డ గుర్తుగా అది మిగిలి విలువల విశ్వసనీయత దెబ్బతింటుంది. ఒక్కొక్కసారి హింస గురించి ప్రస్తావించవలసినపుడు అక్షరాలు సైతం చిన్నబోతాయి.

ఎ). భాగస్వామి హింస :

మనిషి జ్ఞానం అమెరికా వెళ్లినా అతని రాక్షస ప్రవృత్తి ఆలోచన మాత్రం సంకుచితంగా వుంటుంది అని అనేక సంఘటనలు నిరూపించాయి. ఇటీవల కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం కట్నం వేధింపులలో భాగంగా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు భార్యని హింసించి చంపి, డబ్బా నందు ముక్కముక్కలుగా వేయడం చూస్తే మనం ఎక్కడ ఉన్నాం అనిపించింది.  కట్నం అనేది బహుమతి స్థాయి నుంచి భారం వరకు వెళ్ళింది. ఎక్కడ అయినా వ్యాపార సూత్రం నందు కొన్నవారికే ఎక్కవ హక్కు ఉంటుంది. ఇక్కడ మాత్రం అమ్ముడుపోయిన వారికి హక్కు ఉండడం విచిత్రం. భర్త ముఖ్యంగా సంవత్సరాలు గడిచినా కట్నం కోసం వేధించడం మనకి కనబడుతూనే ఉంటుంది. మనస్సు రూపాలు పలు రకాలుగా ఉన్నట్లే హింసించే వారి వైఖరులు గూడ పలువిధాలు.

బి).శారీరక హింస :

ఆడవారిని లలితమైన కుసుమాలుతో పోల్చి ఒక రచయిత చెప్పారు కానీ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వారిని గాయపరిచడం, అవమానించడం, శరీరంపైన వాతలు పెట్టడం, అదే రకంగా సున్నితమైన శరీర భాగాలపైన దెబ్బలు వేయడం ఇవన్నీ శారీరక హింసలో భాగాలు… ఒక్కొక్కసారి శృతి మించి జీవం కోల్పోయే పరిస్థతి ఏర్పడుతుంది. ఇది సహజీవన సౌందర్యాన్ని నాశనం చేయడం ఈ శారీరక హింస కేవలం భాగస్వామికి పరిమితం గాదు, చాలా మంది విచిత్రంగా తమ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి, తమ పిల్లలుని కొడుతూ ఉంటారు. ఆడపిల్లలని మరీ హింసించడం వలన  కొంతమందికి అనవసరంగా పురుషద్వేషం, మనుగడకి నాంది అయిన వివాహంపైన అకారణ ద్వేషం ఏర్పడుతాయి. ఇవి భారతీయ కుటుంబ వ్యవస్థకి ప్రతికూల ఫలితాలు అందిస్తాయి.

సి). లైంగిక హింస :

లైంగిక హింస అనే విషయం గురించి చర్చించడానికి పరిమితులు వుంటాయి. లైంగికపరమైన అంశాలు బహిరంగంగా చర్చించేవి గావు. గృహహింసలో భాగంగా భాగస్వామిని లైంగికంగా వేధించడం, విపరీతమైన రాక్షసకాంక్షలతో సున్నితమైన అంశాలు నందు వేదనకు గురిచేయడం సమర్థనీయం కాదు. ఒక్కొక్కసారి భార్యభర్తల మధ్య అనురాగ బంధం దూరం అయి ఇద్దరు విడిపోయే వరకు అపరిచితుల మాదిరిగా జీవించడం కుటుంబ వ్యవస్థ మనకి అందించిన వరాన్ని శాపంగా మార్చడం.

డి). ఉద్రేకపూరితమైన చర్యలు :

ఉన్మాదం, ఉద్రేకం బొమ్మ బొరుసు లాంటివి. ఉద్రేకం ఒక్కొక్కసారి మంచికి ఉపకరిస్తుంది. ఉన్మాదం పడగ విప్పిన పాములా బుసులు కొట్టి ప్రాణాలని తీస్తుంది. ఉద్రేకం హద్దు దాటితే అది వ్యక్తుల్ని హంతకులు చేస్తుంది. లాలించిన అమ్మని, మురిపెంగా ప్రేమించిన భార్యని కూడా చంపేయాలన్న విష అంకురాన్ని చిగురింపచేస్తుంది. ‘‘ఉద్రేకం మనస్సు గొడల్ని దాటితే చట్టం జైలు గోడలు వద్దకి తీసుకెళ్ళే ప్రమాదం ఉంది. గృహహింసకి ఉన్మాదం నీడలా ఉంది.

ఇ). భావాల హింస :

భావం గొప్పది అది బ్రతుకు పుస్తకం నందు అందమైన ఆలోచనల్ని అందిస్తుంది. భావం ఒక్కొక్కసారి సరిహద్దులని చెరిపివేసి సాంగత్యాన్ని అందిస్తుంది.ఇంకొకసారి సమీపంలో ఉన్నా సాన్నిహిత్యం వేయి కిలోమీటరులు దూరంగా ఉన్న భావాన్ని కలుగు చేస్తుంది. మాటలు అనేవి  మమతని పెంచాలి అనురాగాన్ని అందించాలి. అపార్థాలుకి దారులు కాకూడదు. జీవన భాగస్వామి మహిళా ఉద్యోగిని అయినప్పుడు ఆమెను అనుమానించి వేధించే అనుమాన అసురులు ఎందరో. మమతని మోసుకు వచ్చే భావం అజన్మాంతం గుర్తు ఉంటుంది. అపార్ధాలు ఇనుపతెరని తెరిచే అనుమానాలు తల ఎత్తితే ఆ బంధం ఇక బండలు కావల్సిందే. గృహహింసలో ప్రక్క ప్రక్కనే ఉన్నా మాటల తూటాలు తగిలినపుడు ‘‘తుపాకి దెబ్బతిన్న పాపురంలా’’ విలవిల హృదయం విరక్తితో కూలిపోతుంది.

ఎఫ్). ఆర్థికంగా హింస :

కారల్ మార్క్ అన్న విధంగా అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారాయి. గృహహింస నందు ఆర్థిక అంశాలు భాగం అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సినీతార సంపాదించిన ఆస్తులన్నీ ఆమె భర్త  స్వాధీనం చేయకుంటే అంతిమ యాత్ర గూడ వేరొకరి దాతృత్వంపైన జరపవలసిన దుర్గతి ఏర్పడింది. భార్య సంపాదించిన జీతంపైన హక్కు భర్తదే అన్న భావన నిజంగా ఎవ్వరూ అంగీకరించరు. వేలాది రూపాయిలు జీతం సంపాదిస్తున్నా తన జీతంలోనే మగువ సిటీ బస్సు ఛార్జీలకి, పండుగలకి చీరలకి వందల రూపాయిలు భర్తని దేవరించవలసిన హీనస్థితి అధికశాతం మధ్య తరగతి కుటుంబంలో ఉంది.

జి). వికృత హింస విలయరూపాలు :

  1. హత్యలు : పుట్టించే మరియు మరణింపజేసే హక్కు భగవంతునికి సంబంధించినది. గృహహింసలో అధికశాతం హత్యలు కనబడుతున్నాయి. భర్త భార్యను హత్యచేయడం, పైగా భ్రూణహత్యలు గూడ హింసలో భాగం అయినాయి.
  2. ప్రతికార చర్యలు : వివాహం నందు మానసిక అందం ప్రథానం. చాలా మంది బాహ్యమైన రూపం అందంగా ఉండే భాగస్వామిగా ఎంపిక చేసుకుంటారు. అయితే వారిలో ప్రతికార వాంఛ మొగ్గతొడిగినపుడు స్త్రీ సౌందర్యంపై యాసిడ్ దాడి చేసి, వికృత రూపంగా మార్చి తమ రాక్షస రూపాన్ని బహిర్గతం చేస్తారు. అయితే దీని వలన వివాహ వ్యవస్థ పైన నమ్మకం తగ్గిపోతుంది.
  3. వధువుపై దాడి : నవ వధువు కాళ్ళ పారాణి ఆరకుండానే కాటికి పంపి, మరోసారి సిగ్గులేకుండా వివాహంకు సిద్దపడే వంచకులు ఎందరో 1960-90ల మధ్య కాలం నందు ప్రతి వరకట్నపు హత్య వెనుక గృహహింస ప్రవృత్తి దాగి ఉంది. అబ్బాయిలకి ఎంపిక స్వేచ్ఛ వివాహం అంశం నందు తక్కువగావడం వలన ఇప్పుడు తగ్గింది.
  4. వంచిత స్త్రీలపైన హింస : ఒక సినీరచయిత తన గేయం నందు శారీరకంగా రేప్ ప్రయత్నానికి గురికాబడ్డ వనిత గురించి రాస్తూ ‘నువ్వేమి చేసావు నేరం నిన్ను ఎక్కడ అంటింది శాపం’ అంటూ తన హృదయంలో సానుభూతిని అక్షరాలలో ప్రదర్శించారు. ఎక్కడ అయినా నేరస్థులని వెలివేయడం సహజం గాని రేప్ కి గురికాబడిన వారిని హీనంగా చుస్తూ, వారి బ్రతుకు దుర్భరం అనిపించేలా ప్రవర్తించడం బాధగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వారు ఉరి నుంచే గాదు లోకం నుంచి పారిపోయేలా చేస్తుంది. నేరం ఒకరిది శిక్ష మరొకరిది అనే భావం ఖండించవలసిన అంశం.

ప్రభావం :

  1. మానసికంగా ఎదగని బాల్యం : బాల్యం అనేది అందమైన స్వప్నం అది అందమైన కలల్ని సాకారం చేస్తుంది. అయితే గృహహింస కలిగిన కుటుంబాల నందు వారు నిరంతరం అమ్మ, నాన్న వైరాలు వలన మానసికంగా తెలియని సంఘర్షణకి గురి అయి సమస్యలని ఎదుర్కొనే ధైర్యం లోపిస్తుంది.
  2. శారీరకంగా ప్రభావం : శారీరకంగా హింసించినపుడు చెప్పరాని భయం కలుగుతుంది. కొన్ని సందర్భాల నందు వికలాంగులుగా మారే అవకాశం ఉంది.
  3. మానసిక హింస : అనేక కథలు నందు, చిత్రాల నందు చూపించిన విధంగా మానసిక హింస మనుషులని నిర్వీరం చేస్తుంది. పిరికివారుగా ఆత్మన్యూనత భావం అధికం అయి జీవితాన్ని జయించలేని పరిస్థితి. మానసికంగా ఎదుటివారిని దెబ్బతీయడం ఇక్కడ విచిత్రంగా అనిపించినా అది మనుషులపైన నమ్మకాన్ని తగ్గించివేస్తుంది.
  4. ఆర్థిక హింస : సమాజం మారుతున్న పరిస్థితులు నందు భార్య భర్త యిద్దరు సంపాదించే పరిస్థితి ఏర్పడింది. అయితే భార్య సంపాదనలో అధిక భాగం భర్త చేతులలో వెడుతుంది. కొన్ని సందర్భాలు నందు భర్త చేసిన అనవసరమైన బుణాలకి భార్య నెలసరి వాయిదాలు చెలించడం బాధకరం. ఒక్కొక్కసారి భర్త వ్యసనాలకి భార్య మూల్యం చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధాలే జీవన గమనాన్ని నిర్థేశించడం వెనుక ఆర్ధిక హింస అనివార్యంగావడం విచారకరం.
  5. ధీర్ఘకాల హింస : తరతరాలు మారినా అంతరంగ భావాలు ఏమాత్రం మారడం లేదు. భార్యని హింసిండం హక్కుగా భావిస్తున్నారు. ఒక్కొక్కసారి సంసారిక జీవనం నందు భార్య అంగీకారం లేకుండా ప్రవర్తించడం ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వాఖ్యలు చేయడం ఇంకా దిగజారి అనుమానిత ప్రేరేపితమైన, అవమానకరమైన ప్రవర్తన, ఇవన్నీ దీర్ఘకాల హింస క్రిందకి వస్తాయి.

గృహహింసకి ముగింపు ఎలా పలకాలి ?

భారతీయ సమాజం ప్రారంభం నుంచి సాంప్రదాయాలు, సంస్కృతులు వైభవం ప్రతికగా ఉంది. ఒక్కొక్కసారి వ్యవస్థ నందలి చెడ్డ అంశాలు సమాజం గొప్పతనాన్ని దిగజారుస్తున్నాయి. భారతీయ విలువలకు కుటుంబం ఆధారం పరిస్థితులు దృష్ట్యా ఉమ్మడి కుటుంబం నుంచి ఒంటరికి గా మారినా బంధాలు, అనుంబంధాలు విలువలు తగ్గలేదు. వ్యక్తుల ప్రవర్తన కారణంగా విలువలు తగ్గుతున్నాయి.

గృహహింస అనేది భారతీయ సమాజం నుంచి శాశ్వతంగా తరలిపోవాలని అంటే కొన్ని చర్యలు తప్పవు. కేవలం చట్టాలు ద్వారా వ్యక్తుల పరివర్తనలో మార్పులు తీసుకొని రావలసిన అవసరం ఉంది.

1.భారతీయ కుటుంబ వ్యవస్థ విలువలు గురించి బాల్యం నుంచి పాఠ్యాంశాలలో చేర్చాలి.

  1. మానసికంగా ఎదుగుదలకు వారికి సరైన అవగాహన కల్పించాలి.
  2. స్త్రీ, పురుషులు ఇద్దరు కుటుంబ వ్యవస్థకి కీలకం అని చెప్పాలి.

4.గృహహింసకి పాల్పడితే వారిని బహిరంగంగా శిక్షించాలి.  ఆ నేరాలకి పాల్పడిన వారిపై చర్యలు గురించి ప్రచారం చేయాలి.

  1. స్త్రీ, పురుషుల మధ్య ‘ఇగో’ తలెత్తే అంశాలుని గురించి పరిష్కరించాలి.
  2. కేవలం న్యాయస్థానాలు ద్వారా వివాదాల పరిష్కారం కాకుండా కౌన్సిలింగ్ ద్వారా ప్రయత్నించాలి.
  3. రేప్ మానసికంగా హింసించే వారికి, లైంగిక వేధింపులు చేసే వారిని జన్మఖైదు విధించాలి.
  4. కుటుంబ విలువలు ప్రోత్సహించే విధంగా ప్రసార సాధనాలు ప్రయత్నించాలి.
  5. మీడియాలో ప్రదర్శిస్తున్న సీరియల్స్ నందు స్త్రీ లని ప్రతినాయికలుగా చూపించే వాటిని నివారించాలి.
  6. గృహ హింస అనేది మహిళలపైన గాదు, ఒక్కొక్కసారి పురుషులు బలి ఆవుతున్నారు. అందుకే ఇద్దరికి ఆత్మీయతని చిగురించాలి.

వ్యాసం నందు పరిమితులు దృష్ట్యా కొన్ని అంశాలు ప్రస్తావించడం జరిగింది. గృహహింసని నివారించినపుడు అది ఖచ్చితంగా సమాజ ప్రగతికి అద్ధమైన కుటుంబ గౌరవం పెంచుతుంది.

వ్యక్తులు ఎదుర్కొనే అంశాలుపై సదస్సులు, సమావేశాలు వారి ఆలోచన స్ధాయిని పెంచడం గాకుండా వారి మానసిక పరిణితిని మరింత వికసింపచేస్తాయి. పాఠ్యాంశాలు బోధించే అధ్యాపక బృందం మేథోసంపత్తి ద్వారా ప్రయత్నించినపుడు మంచి స్పందన కలుగుతుంది.

  • దువ్వూరి సుబ్రహ్మణ్య శర్మ, అధ్యాపకులు,

రాజనీతిశాస్త్ర విభాగం,

యస్.కె.బి.ఆర్.కళాశాల, అమలాపురం

సెల్ : 9949039175

 

CLOSE
CLOSE