TEJASVI ASTITVA
MULTI-LINGUAL MULTI-DISCIPLINARY RESEARCH JOURNAL
ISSN NO. 2581-9070 ONLINE

రాయలసీమ కవిత్వం – మానవ విలువలు : జి. నాగేష్ బాబు

రాయలసీమ కవిత్వం – మానవ విలువలు
జి. నాగేష్ బాబు
పరిశోధక విద్యార్థి
హైదరాబాద్ విశ్వవిద్యాలయం
చరవాణి: 97030 93351

సాహిత్యాన్ని అధ్యయనం చేయడమంటే సమాజాన్ని దగ్గరగా చూడటమే. సమాజంలో నెలకొన్న విభిన్నమైన విషయాలను, సంఘటనలను సాహిత్యం ప్రతిబింబింపజేస్తుంది. సమాజంలో జరిగే ఏ సంఘటనకైనా సాహిత్యకారులు ప్రతిస్పందిస్తారు. సమాజంలో సంభవించే ఏ మార్పు అయినా, సాహిత్యంలో వచ్చే ఏ వాదమైనా, ధోరణి అయినా ముందుగా కవిత్వంలో ప్రతిఫలిస్తంది. సాహిత్యంలో మిగతా ప్రక్రియలకన్నా కవిత్వం శక్తివంతమైన పాత్ర పోషిస్తుంది.
సాహిత్యం – సమాజం – మానవ విలువలు:
సామాజిక జీవితానికి సాహిత్యం ప్రతిబింబం. ఒక కాలంలో వుండే సామాజిక వ్యవస్థను ఆ కాలంలో వచ్చే సాహిత్యం ప్రతిబింబిస్తుంది. సమాజంలో మార్పులు వచ్చినప్పుడల్లా సాహిత్యంలో మార్పులు వస్తాయి. సమాజంలోని మానవ సంబంధాలే సాహిత్యంలో ప్రతిబింబిస్తాయి. సమాజానికి సాహిత్యం ప్రతినిధి వంటిది. “ఇతర విషయాల్లాగానే సాహిత్యం కూడా సామాజిక అవసరాల నుంచే పుట్టింది. భాషలాగా, భాషకు ఉన్నత రూపమైన సాహిత్యం కూడా శ్రమనుంచి శ్రమలోనే, శ్రమతోపాటే పుట్టి పెరిగింది. ప్రకృతితో, సమాజంతో ఆవేశంతో కూడిన సంబంధాల ఫలితమే సాహిత్యం” . ఈ విధంగా సాహిత్యానికి సమాజానికి అవినాభావ సంబంధం వుంది. భారతీయ సమాజం వైవిధ్యభరితమైన సమాజం. విభిన్న సంస్కృతులకు, ఆచారాలకు, సంప్రదాయాలకు నిలయం మన భారతదేశం. 21వ శతాబ్దంలో అభివృద్ధి చెందుతున్న శాస్త్ర, సాంకేతిక యుగంలో మానవ విలువలు అత్యంత ప్రధానమైనవి. సమాజంలోని మానవ సంబంధాల మధ్య మానవ విలువలను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైన వుంది.
రాయలసీమ కవిత్వం – మానవ విలువలు:
తెలుగు నేలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్షిణాన వున్న రాయలసీమ ప్రాంతానికి విశిష్టమైన సాహిత్య చరిత్ర, సంస్కృతులు వున్నాయి. ఈ ప్రాంతం అనేక మంది ప్రాచీన, ఆధునిక కవులకు నిలయం. 1980 దశకం నుండి రాయలసీమలో ఆధునిక వచన కవిత్వాన్ని విస్తృతంగా రాస్తున్నారు. రాయలసీమ కవిత్వంలో ప్రతిఫలించే మానవ విలువలను తెలుపడమే ఈ పరిశోధనా వ్యాస పత్రం యొక్క ప్రధాన ఉద్ధేశం.
‘క్షమయా ధరిత్రీ’ అనే కవితలో
“పాలుతాగే రొమ్ము మీద
పాదం మోపే చరిత్ర వాడిది
రక్త బంధాల్ని ఎడం కాలితో తన్నేసి
విలువల్ని వెక్కిరించే నేపథ్యం వాడిది
మాతృత్వమా!
వీధినపడ్డ వార్ధక్యమా
ఎక్కడమ్మా నీ చిరునామా”
పై కవిత్వంలో రాధేయ కన్న తల్లిదండ్రులు ముసలివారు అయినప్పుడు వారిని వృద్ధాశ్రమంలోనూ, అనాథ ఆశ్రమంలోనూ వదిలివేసే కొడుకుల నిర్లక్ష్యాన్ని, తల్లిదండ్రుల ఆవేదనను కవిత్వీకరించారు. కన్న తల్లిదండ్రులు కొడుకులకు భారమవుతున్న నేటి సమాజంలో ఇలాంటి దృశ్యాలు ఎన్నో మనకు తారసపడుతుంటాయి. అలాగే ‘ఆఖరి మెతుకు’ కవితలో
“మనువుని కాదు మార్క్స్‌ని చదవండి
కౌటిల్యుని కాదు ప్లేటోని చదవండి
భారత రాజ్యాంగం అర్థం కావాలంటే
అంబేద్కర్‌ను చదవండి
ఒక బుద్ధుడు, ఒక చార్వాకుడు
ఒక మహావీరుడు
సాగిపోయిన బాటలో నడిచి
మానవతా వాదాన్ని ప్రకటించిన
ఈ జ్ఞాన యోగిని అధ్యయనం చెయ్యండి”
అంటూ ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే మార్క్స్, ప్లేటో, అంబేద్కర్, బుద్ధుడు లాంటి మేధావులను అధ్యయనం చేయాలని తన ఆశావాద దృక్పథాన్ని తెలియ పరుస్తున్నాడు. ‘సౌందర్య రాహిత్యం’ అనే కవితలో
“నేనెక్కడికి వచ్చాను
నేనెక్కడున్నాను
ఒంటెద్దు బండిలోంచి
నగరం నాగరికతలోకి దొర్లిపోయాక
నేను నా ఊరికే పరదేశినయ్యానా?
నా ఊరే నాకు పరాయిదై పోయిందా?
ఇప్పటికీ!
నా శ్వాస నా పల్లెది
నా ప్రాణం మాత్రం పట్నంది”
అంటూ నేటి ఆధునిక మానవుడు గ్రామాలను వదిలి నగరాలకు వలస వెళుతున్నాడు. చిన్న చిన్న గ్రామాలు, పల్లెలు తమ సంస్కృతినీ, అందాలను కోల్పోతున్నాయి. ‘ఇవాళ నా పుట్టిన రోజు’ అనే కవితలో
“ఊరిలో సవర్ణుల పెళ్ళైతే నావాళ్ళు సంబరపడి
తమ దేహాలను పడుపు కోకలుగా పరిచారు
ఊరేగింపుల్లో దివిటీలై వెలిగారు
పండగ పబ్బాల్లో ఇంటి వెల్లలై మెరిశారు
రోజంతా నానా యాతనా చేసి
చివరికి ఇల్లిల్లూ తిరిగి
వెట్టి చీకట్లో ఎంగిలి బుట్టలై మిగిలారు”
చాలా గ్రామాల్లో ఇప్పటికీ పెళ్ళిళ్లూ, పండుగలు, జాతరలు జరిగినప్పుడూ వాటిలో పనిచేసేవారు సమాన్య పేద ప్రజలు. వారిచేత వెట్టి చాకిరీ చేయించుకుంటారు చాలా మంది పేరున్న వాళ్ళు. భూస్వామ్యుల వెట్టిచాకిరికి బలైన బానిసల బ్రతుకును కవి చిత్రించాడు. ‘కసాయి కరువు’ అనే కవితలో
“పసల బాధ సూడ్లాక
కాటి కంపుతాండాం
కసాయి కటికోల్లు
కాళ్ళు ఇరగ్గోట్టి
లారీల్లో కుక్కి
నగరాలకు తోలకపోతాంటే
తల్లి పేగు తెగినట్ల
మా కడుపుల్లో కల్లోలం
కండ్లలో సుడులు”
నేడు పల్లెల్లో, గ్రామాల్లో చాలా మంది రైతులు పశువులను కళేబరాలకు అమ్ముతున్నారు. సరైన వర్షాలు పడక, పశువులను మేపడానికి గడ్డి దొరకక ఈ పరిస్థితి దాపురించిందని కవి రైతుల బాధలను, పశువుల దీన వ్యవస్థను చిత్రించాడు. ‘వలస’ అనే కవితలో
“ఔను వాళ్ళు రైతులు
దేశానికి పట్టెడన్నం పెట్టి
చేతులు తెగిన మొండి మానులు
మొండి మానులను తాపీలుగా చేసి
మేడల్ని గాలిలోకి లేపుతున్న కమానులు”
సమాజంలో రైతుపడే కష్టం మనందరికి తెలిసిందే. అలాంటి రైతులు నేడు దయనీయ స్థితిలో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులు నేడు బిచ్చగాళ్లుగా మారుతున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. ‘కడాకు’ అనే కవితలో
“తీగ చెనిక్కాయ అనిరి ఏస్తిమి
తినేకి తిండి గింజలే కరువాయ
సజ్జలు యాటికి బోయనో
కొర్రలు, సాములు, జొన్నలు యాటికి బోయనో
రాగి సంగటి కతే మర్సిపోతిమి”
రాయలసీమలో అనంతపురం జిల్లాలో పండించే ప్రధాన పంట వేరుశనగ. నేడు ఈ పంట రైతుతో జూదమాడుతోంది. నేడు రైతులు పండించే ప్రధాన ఆహార పంటలు గురించి మరచిపోయే స్థితి నేడు దాపురించిందని కవి కవిత్వీకరించాడు. ‘ప్రకృతి పాట’ కవితలో
“ఇక్కడ కథ మట్టివేర్ల గాథ
రాగిముద్దా వూరిమిండీ
జొన్నరొట్టీ పుండు గూరా
నోట్లో కాలేటి తుంటబీడీ
బొడ్డు కాడి వొక్కాకు తిత్తీ
గనేట్లో కదిలే పారాపలుగూ
గెనం మీద నడిచే గడ్డిమోపూ
ఎద్దుల అదిలించే సెలకోలా
సుర సర మాడే వంగినవీపూ”
సీమలో కనిపించే ప్రధాన రైతుల జీవన గాథల్ని వ్యవసాయ పనిముట్లను గూర్చి కవి కవిత్వీకరించాడు. ‘మరణిస్తున్న నమ్మకం’ అనే కవితలో
“నిజమే
నాచెల్లి గొంతు మీద
ప్రేమ పూసిన కత్తి దిగబడి
తన రక్త దాహాన్ని తీర్చుకుంది
ఆ రోజు, ఆ పసి హృదయంలో
ఎప్పటి లాగానే
ఉదయించిన సూర్యుడు
అర్ధాంతరంగా అస్తమించి
రక్త వర్ణాన్ని చిమ్మి చీకట్లను మిగిల్చాడు
అక్షరాల ఆలయంలో రాక్షస పాదాలు
వెంటాడుతాయనీ, వేటాడుతాయనీ
తెలియని నా చిట్టి తల్లి
చదువుల తల్లి ఒడిలో
సేద తీర్చు కొంటుంటే
‘మనోహర’వదనంతో
మానవ మృగం పంజా విసిరింది”
అంటూ ప్రేమ పేరుతో అమ్మాయిల వెంటపడి చివరకు వారిని అంతం చేసే మనోహరులు ఈ సమాజంలో ఎందరో అని కవిత్వీకరించాడు కవి. శ్రీలక్ష్మి, అయేషా లాంటి ఎందరో దుర్మార్గులచేతిలో బలవుతున్నారని కవి ఆవేదన చెందాడు. ‘సంధ్యా కిరణాలు’ కవితలో
“ ‘మాతృదేవోభవ’ అంటూనే
మానవత్వాన్ని విస్మరించిన నీవు
మాతృ రూణాల్ని పుక్కిలించి
ఉమ్మేసి నేలపాలు చేశావా?
రేపటి నీ జీవన తీరంలో
రెక్కలు తెగిన వృద్ధాప్యం
గొంతు చించుకొని
ఎంతగా అరచి అర్థించినా
కరుణించని కడలి కెరటాలు
సహస్ర శత హస్తాలతో
నిను కబళిస్తాయి”
మానవత్వాన్ని మరచి నేడు ఎందరో కొడుకులు తమ తల్లిదండ్రులను అనాథ, వృద్ధాశ్రమాలలో వదిలిపెడుతున్నారని కవి చెబుతున్నాడు. ‘అమ్మా అని పిలువక ముందే’ కవితలో
“వెలుగు సంగమంతా
చీకటి ప్రసవించిన కర్ణుని
కన్నీటి గాథలో కాల ప్రవాహంలో
అనాథలెందరో అభాగ్యులెందరో
గుక్కెడు అమ్మ పాలు
గొంతు తడవక ముందే
గుప్పెడు మాతృ ప్రేమ
గుండెకు చేరక ముందే
చెత్త కుప్పల్లో
మురికి నీటి గుంటల్లో
మట్టి పొరల్లో రోదిస్తూ రోదిస్తూ
విస్ఫోటనమైన వేయి గొంతుకలై
మానవీయతను ప్రశ్నిస్తున్నాయి!”
అంటూ నేడు సమాజం తల దించుకోవలసిన పరిస్థితి ఎదురైంది. చాలా మంది పసి పాపలు అమ్మ పొత్తిళ్ళల్లో నిద్ర పోవాల్సిన వారు చెత్త కుప్పల్లో, నీటి గుంటల్లో కనిపిస్తున్నారని కవి కవిత్వీకరించాడు. ‘దగ్ధగీతం’ అనే కవితలో
“శవాల గుట్టలపై
ఉగ్రవాదుల విజయకేతనం
విరగబడి నవ్వింది
అగ్ని జ్వాలలను ధరించి
జ్వలిత సంచలిత నేత్రాలతో
శ్వాసిస్తూ శాసిస్తూ
ఉగ్రరూపం దాల్చిన ఉగ్రవాదం
సర్వశక్తి సమన్వితమై
విస్ఫోటిస్తూనే ఉంది”
హైదరాబాద్ గోకుల్ ఛాట్, లుంబినీ పార్కుల్లో విధ్వంసానికి ప్రతిస్పందించి రాసిన కవిత్వం ఇది. అలాగే ‘శిలాక్షరాలు’ అనే కవితలో
“ఉగ్రవాదుల భీభత్సం
తీవ్రవాదుల విధ్వంసం
నెత్తిమీద కూర్చొన విన్యాసాలు చేస్తుంటే
నా దేశంలో రోడ్లన్నీ
రథ యాత్రలతో నిండిపోయాయి
మండుతున్న రైళ్లలో
మానవత్వం మసై పోతూంటే
రెక్కలు విప్పిన మతోన్మాదం
రక్తం తాగడానికి సిద్దమయ్యింది”
నేడు తీవ్రవాదం, ఉగ్రవాదం సమాజంలో ఎక్కువగా వ్యాపిస్తోందని, దీనిని నిర్మూలించాల్సిన అవసరం వుంది. ‘నాయకుడు’ అనే కవితలో
“అతని కన్నా వేశ్య నయం
ఆమె వల వేస్తుంది
ఒక పూట తిండి కోసం
అతను వల వేస్తాడు
ఒక టర్మ్ కోసం
ఆమె సర్వం దోచి పెడుతుంది
అతను సర్వం దోచుకెళ్తాడు
ఆమె దేహాన్ని అమ్ముకుంటుంది
అతను దేశాన్ని కుదువ పెడతాడు”
అంటూ ఈ దేశాన్ని పాలించే నాయక వర్గం దేశాన్ని సర్వం దోచుకుంటున్నారని వీరికన్నా వేశ్యలే నయం అంటూ కవి వ్యంగ్యంగా చిత్రించాడు. అలాగే ‘వాడే’ కవితలో
“గనిలో ముడి ఖనిజం తెచ్చాడు
శుభ్రం చేసి కొలిమిలో కాల్చాడు
కరిగిన ఖనిజం అచ్చులో పోశాడు
తళతళలాడే కత్తిని తీశాడు
కత్తిని వాడి చేతికిచ్చాడు
తలకాయను వధ్య శిలపై వంచాడు”
సమాజంలో వృత్తులను నమ్ముకొని జీవనం సాగించే వారి వేదనను కవిత్వీకరించారు. నేడు ఆ వృత్తులన్నీ అంతరించిపోతున్నాయి. ‘గోడలు లేని జైలు’ కవితలో
“ఏ గొలుసు హత్య ఎక్కడ ఆగుతుందో
ఏ మగనాలి నల్లపూస
ఏ కత్తి కొనకు వేలాడుతుందో
రాతి గుండెకు తగిలి
ఏ ముత్తైదు చేతి గాజుల శోభ బోసిపోతుందో
పొంచి చూచే నాటు బాంబులు
ఎర్రగా మాట్లాడే వేట కొడవళ్ళు
ఎగిరి పడే తలకాయలు
ఒరిగిపోయే మొండాలు
తరాల తరబడి కుళ్ళిన నాగరిక నుంచి
ఎక్కడిదీ పాడు కంపు?”
అని సీమలో జరిగే ఫ్యాక్షన్ దాడులు, వర్గ కక్ష్యలు, బాంబు దాడులు లాంటి దృశ్యాల్ని కవిత్వీకరించాడు. ‘చెమట ముత్యం’ కవితలో
“వాడికింకా మట్టిమీద మమకారం చావలేదు
వర్తమానమంతా చావుదరువుగా మారినా
ఒక బీడీతుంట దమ్ముతో చలిని ఎదిరిస్తాడు
కండనూ గుండెనూ పిండి ఎండన ఆరేస్తాడు
ఒకే ఒక చిరునవ్వుతో రాలే కన్నీటి బొట్టును ఆపేస్తాడు”
అని ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల జీవన వ్యథలను వారి ఆత్మ స్థైర్యాన్ని కవిత్వీకరించాడు. ‘ఒక శీతాకాలపు సాయంత్రం’ అనే కవితలో
“చిత్తు కాగితాలు
చిత్తు జ్ఞాపకాలతో
ఇల్లు నిండిపోతూనే వుంది
గీతలు పడిన గోడలు
చిరిగిపోయిన క్యాలెండర్లు
రాయని డైరీలు – విరిగిన గోడ గడియారాలు
ఇల్లు ఖాళీ చేసి వస్తుంటే
అడుగులు ముందుకు
మనసులు వెనక్కూ
లాగుతూనే ఉన్నాయి
నిజానికి ఖాళీ అయ్యింది ఇల్లు కాదు
మేమే”
అంటూ ఇల్లు ఖాళీచేసి పోయేటప్పుడు బాడుగ ఇళ్ళల్లో వున్నప్పుడు తమకున్న జ్ఞాపకాలను, అనుభవాలను వదిలి వెళ్లలేక ఆ సందర్భాన్నీ కవి గుర్తు చేస్తున్నాడు. ‘అవేద’ అనే కవితలో
“నేను అంటరాని వాడిని
నాచర్మం ఒలిచి నీ పాదాలకు చెప్పులు తొడిగిన వాడిని
నీ వీధులు వూడ్చి నీ సర్వ కల్మషాన్నీ శుభ్రం చేసినవాడిని
నీ మైల బట్టలు వుతికి నీ సమస్త మురికినీ వదలగొట్టి
నీ సకల రోగ క్రిముల్నీ అంటించుకొని ఈసురోమని
బ్రతుకు వెళ్ళమారుస్తున్న వాడ్ని”
అని కవి అంటరాని జాతుల గూర్చి వారి ఆవేదనను, జీవిత గాథలను కవిత్వీకరించాడు. మాల మాదిగలను అంటరాని వారిగా చూసి బానిసలుగా మార్చి వారిచేత వెట్టి చాకిరి చేయించుకుంటున్న దీన గాథను కవి చిత్రించాడు. ‘కంచంలోని బువ్వ’ అనే కవితలో
“పొలం గట్ల సింగారం
అదృశ్యమైంది
అమ్మలక్కల పనిపాటలు
పాడెగట్టాయి
పల్లె పనుల్ని యంత్రాలు
మింగేశాయి
పల్లె పనుల్ని యంత్రాలు
మింగేశాయి
కలుపు తీయడం
కోత కోయడం
కుప్ప నూర్చడం యంత్రమే”
అని నేడు ప్రపంచీకరణ యుగంలో పల్లెల్లో పనివాళ్ల పాటలు, పనులు అన్ని అదృశ్యమై కనుమరుగవు తున్నాయని కవి ఆవేదన చెందాడు. అలాగే ‘ఆరో భూతం’ కవితలో
“రోకట్ల నుండి కుక్కర్ల దాకా
చందనం నుండి గార్నియర్ దాకా
లంగా ఓణి దగ్గర్నుంచి
మిడ్డీ స్కర్టు దాకా అభివృద్ధి పరిచాడు
ఇది నాగరికత, ఇదే సంస్కృతి అంటూ
గ్లోబల్ పాఠాలు కర్ణభేరి బద్దలయ్యేలా
వినిపిస్తున్నాడు
పట్టెడన్నం వద్దు పాస్టుపుడ్డు తినమంటాడు
అమ్మా భాష వద్దు ఆంగ్ల భాష ముద్దంటాడు”
అంటూ ప్రపంచీకరణ ప్రభావం వల్ల గ్రామీణ జీవన సంస్కృతి, సంప్రదాయం కనుమరుగవుతోందని, దీనిని మనందరం కాపాడుకోవాల్సిన అవసరం వుందని మనకు గుర్తు చేస్తున్నాడు.
గ్రంథ సూచిక:
1. అబ్దుల్ ఖాదర్, వేంపల్లి. మేఘం (కవిత్వం). హైదరాబాద్. జయంతి పబ్లికేషన్స్. 2008.
2. మధుసూధన రావు, త్రిపురనేని. సాహిత్యంలో వస్తు శిల్పాలు. హైదరాబాద్. పర్‌స్పెక్టివ్స్. 1987.
3. బాలాజి, పలమనేరు. మాటల్లేని వేళ (కవితా సంపుటి). పలమనేరు. పవిత్ర & ప్రణీత ప్రచురణలు. 2015.
4. వెంకటకృష్ణ, జి. దున్నేకొద్ది దుఃఖం (కవిత్వం). కర్నూలు. స్ఫూర్తి ప్రచురణలు. 2005.
5. మోహన్, కెంగార. విన్యాసం (కవిత్వం). కర్నూలు. సాహితీ స్రవంతి. 2012.
6. చంద్రశేఖర శాస్త్రి, వి. ఒక కత్తుల వంతెన (కవిత్వం). అనంతపురం. వసంత ప్రచురణలు. 2008.
7. రాధేయ. అవిశ్రాంతం (కవిత సంపుటి). అనంతపురం. స్పందన అనంత కవుల వేదిక ప్రచురణ. 2009.
8. ప్రేంచంద్, జూపల్లి (సంపా). అనంత కవిత (అనంత కవిత సంకలనం). అనంతపురం. జిల్లా సాంస్కృతిక మండలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. 2012.
9. ప్రేంచంద్, జూపల్లి. నిచ్చెన మెట్ల లోలకం (కవిత సంపుటి). హైదరాబాద్. పాలపిట్ట బుక్స్. 2011.
10. జగదీష్, కెరె. సముద్రమంత గాయం (కవిత సంపుటి). రాయదుర్గం. కెరె & కెరె కంప్యూటర్స్. 2011.
పాద సూచికలు:

CLOSE
CLOSE