TEJASVI ASTITVA
MULTI-LINGUAL MULTI-DISCIPLINARY RESEARCH JOURNAL
ISSN NO. 2581-9070 ONLINE

18వ శతాబ్దానికి చెందిన ఆయుర్వేద తాళపత్ర గ్రంథం లోని కొన్ని తెలుగు మరియు సంస్కృత  పదాలు –  ఒక పరిచయం. డాక్టర్ బాలరాజు చంద్రమౌళి

18 శతాబ్దానికి చెందిన ఆయుర్వేద తాళపత్ర గ్రంథం లోని కొన్ని తెలుగు మరియు సంస్కృత  పదాలు –  ఒక పరిచయం.

డాక్టర్ బాలరాజు చంద్రమౌళి , వృక్ష శాస్త్ర అధ్యాపకులు, యస్. జి. ఎ. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యలమంచిలి  Phone:  9491931211,  Mail Id: [email protected]

Abstract

 ఆయుర్వేదం, భారతీయ సనాతన సాంప్రదాయ వైద్య విధానం. మనిషి ప్రాణం, జీవన విధానానికి సంబంధించిన జ్ఞానమే ఆయుర్వేదం. ఇది అత్యంత ప్రాచీనమైన, ప్రామాణికమైన వైద్య విధానం. ఋషులు, సిద్ధులు తమ వాదాల ద్వారా, తర్కాల ద్వారా, తపస్సు మరియు ప్రయోగాల ద్వారా సూత్రీకరించిన బడిన బృహత్ విజ్ఞానం ఆయుర్వేదం. ఇంతటి మహత్తర వైద్య విధానాన్ని, తాటి ఆకు మరియు భూర్జ పత్రాలపై లిఖించారు. ఆనాడు కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై,  తోలు  వస్తువులపై, రాతి  స్థంభాలపై, చెట్టు బెరడుపై, భారతీయ సంస్కృతి వైభవాన్ని,  సంగీత,  సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య,  ఖగోళ సంబంధ  విషయాలను   లిఖించి పొందు పరచారు. వీటిని రాత ప్రతులు (Manuscripts) అంటారు. దక్షణ  భారతదేశంలో సాధారణంగా  తాటి ఆకు మరియు భూర్జ పత్రాలను ఉపయోగిస్తారు. వీటిని  తాళపత్ర గ్రంధాలు (Palm-leaf Manuscripts) అంటారు. తాళపత్ర గ్రంథాల యొక్క నాణ్యత సుమారు 600 సంవత్సరాల వరకు ఉంటుంది (Vaidya and Pratibha, 2016). ఆతర్వాత అవి క్రమేణా శిథిలమవుతూ వస్తాయి.  తాళపత్ర గ్రంధాలలోని సమాచారాన్ని అత్యంత సమర్థవంతంగా నిల్వచేసి   దాచి పెట్టగల యాంత్రిక విధానము డిజిటైజేషన్ (Ahmed, 2009). తెలుగు మరియు సంస్కృత పదాలు కలిసిన, రాయలసీమ ప్రాంతానికి చెందిన, తెలుగు లిపిలో ఉన్న ఒకానొక ఆయుర్వేద తాళపత్ర గ్రంథం (33 ఆకులు), సేకరించి, క్షుణ్ణంగా అధ్యయనం చేసి మొదట యదావిధిగా రాసి, అనువాదం చేసి, ఆతర్వాత కంప్యూటరీకరణ చేయడం జరిగినది. తాళపత్ర గ్రంధంలోని కొన్ని పదాలు, అక్షరాల ప్రత్యేక లక్షణాల ఆధారంగా ఇవి దాదాపు 18 లేదా 19 వ శతాబ్దానికి చెందినవని తెలుస్తున్నది. తాళపత్ర గ్రంధంలోని అప్పటి  తెలుగు పదాలు, ఈనాటి ప్రజలకు తెలియదు, మరియు అర్థమగు రీతిలో లేవు. మరుగున పడి వున్న ఒకానొక ఆయుర్వేద తాళపత్ర గ్రంధాన్ని వెలికి తీసి,  అప్పటి  తెలుగు భాషను,  కొన్ని తెలుగు  మరియు  సంస్కృత పదాలను ఈనాటి తరానికి  పరిచయం  చేసి  ఒక అవగాహన కలిగించుటయే ఈ  పేపరు యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

కొన్ని ముఖ్యమైన  పదాలు: 

మేహ,  ప్రమేహ, వెంకి, కాలుమడి, కరాటము, కలి, విడెము,  మలాం,  అత్మజలం.

పరిచయం:

ఆయుర్వేదం, భారతీయ సనాతన సాంప్రదాయ వైద్య విధానం. ఆయువ్ = అనగా జీవం లేదా ప్రాణం. వేదం అనగా జ్ఞానం.  మనిషి ప్రాణం, జీవన విధానానికి సంబంధించిన జ్ఞానమే ఆయుర్వేదం. ఇది అత్యంత ప్రాచీనమైన, ప్రామాణికమైన వైద్య విధానం. ఇది వేద కాలం నాటిది. ఉప వేదాలలో ఒకటి. ఋషులు, సిద్ధులు తమ వాదాల ద్వారా, తర్కాల ద్వారా, తపస్సు మరియు ప్రయోగాల ద్వారా సూత్రీకరించిన బడిన బృహత్ విజ్ఞానం ఆయుర్వేదం.

అయుర్వేదంలో మూల గ్రంధాలైన  సుశ్రుత సంహిత, చరక సంహిత లను సుశ్రుతుడు మరియు చరకుడు వరుసగా  రచించారు. ధన్వంతరిను దేవ వైద్యుడుగా పరిగణిస్తారు. ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరం పంచభూతాత్మకం మరియు సప్తధాతువుల సమ్మేళనం.  మానవ శరీరం ఆరోగ్యంగా ఉండటానికి మూడు ప్రాథమిక శక్తి మూలాలు పనిచేస్తాయి. అవి వాత, పిత్త, కఫాలు. వీటినే త్రిదోషాలు అంటారు.  ఇవి సరైన నిష్పత్తిలో ఉంటే ఆరోగ్యం,  సరైన నిష్పత్తిలో లేనప్పుడు  వ్యాధి కలుగుతుంది.  త్రిదోషాలను సరి చేయుట ద్వారా వ్యాధి నయం చేయబడుతుంది.  ఆయుర్వేదంలో రోగి యొక్క వ్యాధి సోకిన భాగాలే కాకుండా మనస్సు, అలవాట్లు, జీవన విధానం,  శరీరం మొత్తం పరిగణనలోనికి తీసుకొని రోగాన్ని నయం చేస్తారు.  ఈ వైద్య విధానంలో మందు మొక్కలను జంతువులను కొన్ని రసాయనాలను కూడా ఉపయోగిస్తారు.
ఇంతటి మహత్తర వైద్య విధానాన్ని ఆనాడు కాగితం లేనప్పుడు రాగి, బంగారు రేకులపై,  తోలు  వస్తువులపై, రాతి  స్థంభాలపై, చెట్టు బెరడుపై,  తాటి ఆకు మరియు భూర్జ పత్రాలపై లిఖించారు. వీటిని రాత ప్రతులు (Manuscripts) అంటారు. దక్షణ  భారతదేశంలో సాధారణంగా  తాటి ఆకు మరియు భూర్జ పత్రాలను ఉపయోగిస్తారు. వీటిని  తాళపత్ర గ్రంధాలు (Palm-leaf Manuscripts) అంటారు. తాటి చెట్టు నుండి తాటాకు పత్రాలను తీసి వాటిని అనేక మార్పులకు గురి చేసి ఘంటం (Stylus) అనే కలంతో  రాయడానికి వీలుగా తయారుచేస్తారు.  సంస్కృతం, తెలుగు, ఒరియా, తమిళం. కన్నడ, మరాఠీ  మొదలైన భాషలలో తాళపత్ర గ్రంథాలు లభిస్తున్నాయి. ఒరిస్సా రాష్ట్రం అత్యధికంగా తాళపత్ర గ్రంధాలు  గల రాష్ట్రంగా ప్రసిద్ది కెక్కి, ఆ రాష్ట్ర సంస్కృతిని,  కళా  వైభవాన్ని చాటుతున్నవి  (Patel, 1997).

తాళపత్ర గ్రంథాలలో ఆయర్వేద  వైద్య విధానానికి సంబంధించిన  జ్ఞానమే కాకుండా,  భారతీయ సాహిత్యానికి, కళలకు, భారత  సంస్కృతి, సనాతన సాంప్రదాయ వైభవానికి చెందిన  జ్ఞానాన్ని కూడా పొందుపరిచారు. అందుకే తాళపత్ర గ్రంథాలు భారతదేశానికి చెందిన విలువైన జాతీయ సంపదగా (John et al., 2016) పేర్కొంటారు.  తాళపత్ర గ్రంథాల యొక్క నాణ్యత సుమారు 600 సంవత్సరాల వరకు ఉంటుంది  (Vaidya and Pratibha, 2016). ఆతర్వాత అవి క్రమేణా శిథిలమవుతూ వస్తాయి.

.           తెలుగు మరియు సంస్కృత పదాలు కలిసిన, రాయలసీమ ప్రాంతానికి చెందిన, తెలుగు లిపిలో ఉన్న ఒకానొక ఆయుర్వేద తాళపత్ర గ్రంథం (33 ఆకులు) పై నా పరిశోధన జరిగినది.  డాక్టర్ దుద్యాల నారాయణ గారి ఆధీనంలో ఉన్న ఈ తాళపత్ర గ్రంధాలు, వారి మనుమడు డాక్టర్ మల్లికార్జున, అసోసియేట్ ప్రొఫెసర్, ఆచార్య నాగార్జున యూనివర్సిటి, గుంటూరు,  గారి దగ్గర దాచబడి ఉన్నవి. ఇతని పర్యవేక్షణలో Studies on documentation, translation and digitization of ancient Telugu palm-leaf manuscript (Talapatra) and phytochemical and pharmacological investigations of an important medicinal plant, black rice (Oryza sativa L.) అనే అంశంపై నాపరిశోధన పత్రం సమర్పించినందుకు గాను నాకు 25-10-2018లో Ph. D ప్రధానం చేయడం జరిగినది.

Fig.  1 ఒక సాధారణ తాళపత్ర గ్రంధ పుస్తకం.

సాహితీ  సంబంధమైన  తాళపత్ర  గ్రంధాలు:

Fig. 2.  18 వశతాబ్దానికి చెందిన సంస్కృత భాషలో గల తాళపత్ర గ్రంధం.

Fig. 3 తమిళ భాషలో గల తాళపత్ర గ్రంధాలు.

 

 Fig. 4 నా పరిశోధనలో ఉపయోగించిన, తెలుగు భాషలో గల ఆయుర్వేద తాళపత్ర గ్రంధాలు.

మెథడాలజి:

సేకరించిన తాళపత్ర గ్రంధాలను క్షుణ్ణంగా  అధ్యయనం చేసి మొదట యదావిధిగా రాసి, అనువాదం చేసి, ఆతర్వాత కంప్యూటరీకరణ చేయడం జరిగినది.  దీనిని ఒక పుస్తకం రూపంలో కూడా విడుదల చేయడం జరిగినది. వీటిని చదివి అర్ఠం చేసుకోవడానికి అయుర్వేద డాక్టర్లను, ప్రాక్టీషనర్లను, హోమియోపతి డాక్టర్లను సంప్రదించి ఆనాటి పాత   తెలుగు లేదా సంస్కృత పదాలను అనువాదం  చేసి ఈనాటి ప్రజలకు  అర్థమగు రీతిలో రచించడం  జరిగినది. డాక్టర్  శంకర నారాయణ ఇంగ్లిష్ నుండి తెలుగు, నుండి ఇంగ్లిష్ నిఘంటువు  కూడా అనువాద  ప్రక్రియకు ఎంతగానో తోడ్పడినది. తెలుగు లేదా సంస్కృతంలో  ఇవ్వబడిన  వ్యాధుల,  మొక్కల మరియు కొన్నిరసాయనిక పదార్థాల  పేర్లను  అనువాదం చేయడానికి విద్వాన్ శ్రీ ములుగు రామలింగయ్య  గారిచే రచించబడిన  “వైద్య యోగ రత్నావళి” మరియు ఇతర ఆయుర్వేద   గ్రంధాలు ఉపయోగపడినవి. మొక్కల శాస్త్రీయ  నామాలను తెలుసుకొనుటకు, వృక్షశాస్త్ర సంబంధమైన శాస్త్రీయ గ్రంధాలను  పరిశీలించడం  జరిగినది.

తాళపత్ర గ్రంధంలోని కొన్ని పదాలు, అక్షరాల ప్రత్యేక లక్షణాల ఆధారంగా ఇవి దాదాపు 18 లేదా 19 వ శతాబ్దానికి చెందినవని తెలుస్తున్నది (https://www.engr.mun.ca).

వ్యాధులు లేదా మొక్కలను వరుసను తెలియజేయుటకు అప్పటి తెలుగు  సంఖ్యలను ఈ తాళపత్ర గ్రంధాలలో  ఉపయోగించడం జరిగినది. వీటిని History of Hindu Mathematics అనే పుస్తకం ఆధారంగా  అనువాదం చేయడం  జరిగినది (Datta and Singh, 1935).

Table. 1  తాళపత్ర గ్రంధాలలో ఉపయోగించిన తెలుగు అంకెలు, వాటి అనువాదం.

౧౦
0 1 2 3 4 5 6 7 8 9 10

 

ఫలితాలు:

ఈ పరిశోధన ఫలితంగా, వ్యాధులను నయం  చేయుటకు  మొత్తం  120 రకాల మందుల తయారీ విధానాలను సూత్రీకరించడం జరిగినది. 29 రకాల వ్యాధులను,  164 రకాల  మొక్కలను, 6 రకాల  జంతువులను,  వాటినుండి లభించే ఉత్పన్నాలను మరియు  26  రకాల రసాయన పదార్థాలను గుర్తించడం  జరిగినది. సౌలభ్యం కొరకు  కొన్నిరకాలను మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగినది.

Table. 2 కొన్నివ్యాధుల  పేర్లు.

S.No Name of the  disease  present in Palm  leaf in  Telugu  or  Sanskrit Name of  disease in English

 

1 మేహ, మేహం, సురుకు మంట.  Mutra-Kricchra (Burning sensation), Mutraghata (Anurea).
2 ప్రమేహ, ప్రమేహం. Urinary problems (Polyurea, Polydypsia, Diabetes).
3 అశ్మరి Urinary stones
4 తెల్ల   ప్రమేహం,  తెల్ల  కుసుమ Leucorrhoea   or  White  Discharge
5 ఎర్ర  ప్రమేహం Menorhagia or Rakta Prameha
6 ముట్టు  కుట్టు, గంటు  నొప్పి Menstrual  pains  or  Dysmenorrhoea
7 శవ్వాయి పొక్కు, శగ, ఫిరంగి రోగం. Gonorrhoea
8 సుఖ సన్ని Syphilis
9 వెంకి Fever
10 చలివెంకి Malaria
11 అగ్ని మాంద్యం Loss of  Appetite
12 అక్షరాలు Permanent  Scars on skin

Table. 3 కొన్ని మొక్కల పేర్లు.

S.No Name  of the plant Modern name Scientific name
1 కుమారి, కన్యా కుమారి కల బంద Aloe vera (L.) Burm.f.
2 యేరండ అముదం Ricinus communis L.
3 హరిద్ర పసుపు Curcuma longa L.
4 అశ్వథ్థ రావి Ficus religiosa L.
5 న్యగ్రోధ మర్రి Ficus benghalensis L.
6 పిచ్చుమంద వేప Azadirachta indica A.Juss.,
7 అర్క జిల్లేడు Calotropis gigantia (L.)R.Br.
8 గుంజ గురివింద Abrus precatorius L.
9 బిల్వం మారేడు Aegle marmelos (L.) Corr.
10 మరీచ మిరియాలు Piper nigrum L.
11 నిర్గుండి వావిలి Vitex negundo L.
12 అశ్వ గంధ పెన్నేరు Withania somnifera (L.)Dunal I Dc.

 

Table. 4 కొన్ని పారిభాషిక పదాలు.

S.

No

Telugu words Translated words S.

No

 Telugu words Translated words
1 కలి కడుగు నీరు 5 కరాటము చిన్న గిన్నె(Small bowl)
2 మలాం పూతమందు (Ointment) 6 కాలుమడి మూత్రం (Human urine)
3 అంజనం కాటుక (Collyrium) 7 విడెము (or) విడియము. తాంబూలం (Betel quid)
4 నారికేళాంజనం కాటుక (Collyrium) 8 ఆత్మ జలం కొబ్బరి నీరు

(Coconut  water)

 వివరణ:

కాగితం కనిపెట్టబడని రోజులలో రాగి రేకులు, తాటి ఆకు పత్రాలు, భూర్జ పత్రాలు, తోలు వస్తువులు, రాతి  పలకలు, స్థంభాలు మొదలైన వాటిపై సంస్కృతి, సాహిత్యం, కళలు మరియు చరిత్రకు సంబంధించిన సమాచారం రాసేవారు. వీటిని రాత  ప్రతులు (Manuscripts) అంటారు. చేతితో లిఖించ బడిన ఏ పత్రాన్నైనా రాత ప్రతి  (Narayana, 2005) అంటారు. దక్షణ భారత దేశంలో  తాటి ఆకు పత్రాలు, భూర్జ పత్రాలు సర్వ సాధారణంగా ఉపయోగించే  రాత  ప్రతులు (Agrawal, 1984; John et  al., 2016). తాటి ఆకు పత్రాలను తాటి చెట్టు నుండి కోసి, కొన్ని మార్పులకు గురిచేసి, రాయడానికి  అనువుగా తయారు  చెస్తారు. వీటిపై  ఘంటంతో (Stylus) లిఖిస్తారు. భారతదేశం యొక్క  చరిత్ర,  సంస్కృతి, సంగీతం, సాహిత్యం, ఖగోళ శాస్త్రం,  అయుర్వేదం మొదలైన అంశాలకు సంబంధించిన సమాచారం  ఈ  తాళపత్ర గ్రంధాలలో లిఖించి నిక్షిప్తం చేశారు. అందుకే వీటిని భారత జాతి  నిధులుగా పరిగణిస్తారు. తాళపత్ర గ్రంథాలు నశించిపోతే అది భారతజాతి ఆత్మహత్యగా (Vaidya and Pratibha, 2016) పరిగణించేంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

సేకరించిన33  పత్రాలుగల ఆయుర్వేద తాళపత్ర గ్రంధాలను క్షుణ్ణంగా అధ్యయనం  చేసి, వాటిని  యధావిధిగా  మొదట  రాసి,  అతర్వాత అనువాదం చేసి, శిధిలమవుతున్న వాటిని కంప్యూటరీకరణ చేసి “తాళపత్ర గ్రంధాలు-ఆయుర్వేద వైద్య  విజ్ఞానం”అనే పేరుతో గ్రంధస్థం చేయడం జరిగినది(Mallikarjuna and Chandramouli, 2014).

తాళపత్ర గ్రంధాలలోని  సమాచారాన్ని అత్యంత సమర్థవంతంగా నిల్వచేసి   దాచి పెట్టగల యాంత్రిక విధానము డిజిటైజేషన్ (Ahmed, 2009). భారత ప్రభుత్వం, రాత  ప్రతులు లేదా లిఖిత పుస్తకాలను (Manuscripts) డిజిటైజేషన్ చేయుటకు The Indira Gandhi National Centre for the Arts (IGNCA)(1987) స్థాపించింది(Gaur  and  Chakraborty,  2009). భారతీయ సంస్కృతి,  సాహిత్యం,  విద్య మరియు వైద్యానికి సంబంధించిన లిఖిత  పుస్తకాల సంపదను (Manuscript wealth of India) డిజిటీకరణ  చేయుటకు National Mission for Manuscripts (NMM)  (2003) స్థాపించింది (Majumdar, 2005). భారత  ప్రభుత్వ సంబంధిత విభాగానికి  చెందిన  AYUSH వారు, సాంప్రదాయక  ఆయుర్వేద  వైద్య సమాచారాన్నిసేకరించి, అంతర్జాతీయంగా, 5 భాషలలో (English, French, German, Spanish and Japanese.) డిజిటీకరణ  చేయుటకు TKDL (Traditional knowledge digital library)(2001) స్థాపించబడి, కృషి చేస్తుంది.

ముగింపు:

ఇంతటి ప్రాధాన్యతగల తాళపత్ర గ్రంథాలు ఏ భాష, ఏ  ప్రాంతానికి  చెందినప్పటికీ, వాటిపై పరిశోధనలు చేసి వాటిని వెలుగులోకి తీసుకు రావలసిన అవసరం ఉంది. ఆ సనాతన విజ్ఞానాన్ని భావి తరాలకు తెలియజేయవలసిన అవసరమూ ఉంది. ఇప్పటికీ అనేక తాళపత్ర గ్రంధాలు మరుగున పడి  ఉన్నాయి.  వాటిపై మరిన్ని పరిశోధనలు  చేసి వాటిని గ్రంధస్తం చేసి, భద్రపరుచుకోవలసిన బాధ్యత మనపైన ఎంతైనా ఉంది.

References:

 1. Agrawal, O.P., 1984. Conservation of manuscripts and paintings of South-east Butterworths in association with the International Institute for Conservation of Historic and Artistic Works.
 2. Ahmed, F., 2009. Digitization as a Means of Preservation of Manuscripts: Case study of  Osmania University Library.pp.93-97.
 3. Datta, B. and Singh, A.N., 1935. History of Hindu mathematics. Asia Publishing House; Bombay.
 4. Gaur, R.C. and Chakraborty, M., 2009, October. Preservation and access to Indian manuscripts: A knowledge base of Indian cultural heritage resources for academic libraries. An International Conference on Academic Libraries (ICAL), pp.90-98.
 5. https://www.engr.mun.ca
 6. John, J.I.L.B.Y., Shukla, A., Nair, L.P., Nampoothiri, V. and Mund, J.S., 2016. Basics of Manuscriptology. Unique Journal of Ayurvedic and Herbal Medicines4(01), pp.26-30.
 7. Majumdar, S., 2005. Preservation and conservation of literary heritage: A case study of India. The International information & library review, 37(3), pp.179-187.
 8. Mallikarjuna Kokkanti and Chandramouli Balaraju, 2014. Talapatra grandhalu-Ayurveda vaidya vignanam. Published by Kokkanti Lakshmidevi at Donbosco Press, Guntur.
 9. Narayana, A., 2005. History of Manuscriptology: study of medical Bulletin of the Indian Institute of History of Medicine(Hyderabad),35(1), pp.61-76.b
 10. Patel, C.B., 1997. Panoramic palm leaf manuscripts of Orissa. CHRJ, 47(1), pp.42-53.
 1. Vaidya S M and Pratibha V, 2016. Writing in Ancient India and writing materials – In the study of Manuscripts. International Journal of Innovative Research and advanced studies (IJIRAS), 3(10), pp. 240-246.

 

CLOSE
CLOSE